ఇప్పటికే ఎంతోమంది సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ‘బాహుబలి’ సినిమా కోసం ప్రత్యేకంగా ఫోలే కళాకారుడు ఫిల్లిప్ వాన్ లీర్ కూడా రంగంలోకి దిగాడట. ‘బాహుబలి’ సినిమా కోసం ఇప్పటివరకు తీసిన సన్నివేశాలకు సంబంధించిన సౌండ్ ఎఫెక్ట్స్ పనులు ప్రపంచ ప్రద్ధిగాంచిన ఫోలే సాంకేతిక నిపుణుడి ఆధ్వర్యంలో ప్రారంభం అయ్యాయి. యూరోప్ లో ప్రసిద్ది గాంచిన బెల్జియం లోని దామే బ్లాంచే కాంప్లెక్స్ లో ఫోలే పనులు సాగుతున్నాయి. బూట్ల నుండి తలుపులు తెరుచుకునే వరకు ప్రతి చిన్న శబ్దాన్ని స్పష్టంగా ఆ సినిమా చూస్తున్న వారికి నిజమైన అనుభూతి కలిగే విధంగా ఈ ఫోలే ప్రక్రియ చేస్తుంది. కాబట్టే ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ చేయని సాహసాన్ని రాజమౌళి ‘బాహుబలి’ కోసం చేస్తున్నాడని టాక్. ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్థాయిలో విడుదల చేసేందుకు రాజమౌళి ప్రయత్నిస్తూ ఉండటంతో ఈ సినిమాలోని సాంకేతిక విలువలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఫోలే సాంకేతికతను జోడిస్తున్నారు. అందుకే ఈ సినిమా 175 కోట్ల భారీ బడ్జెట్ సినిమాగా మారుతోంది.