పవన్ ‘గబ్బర్ సింగ్ 2’ ఎప్పటికి మొదలు అవుతుందో తెలియకపోయినా ఈ సినిమాకు అనుకున్న కథ మాత్రమే కాదు, సినిమా టైటిల్ కూడా కబ్జా అయిపోయినట్లుగా తెలుస్తోంది. సంపత్ నంది పవన్ కాపౌండ్ నుండి రవితేజా ఇంటికి మారిపోయి మాస్ మహారాజతో సినిమాను మొదలు పెట్టడానికి ప్రయత్నాలు అధికారికంగా ప్రారంభించడంతో పవన్ తో సంపత్ నంది తీస్తాడు అనుకున్న సినిమా కధే రవితేజా సినిమాకు కథగా మారబోతోంది అనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు తమన్నా కూడా తాను సంపత్ నంది దర్శకత్వంలో రావితేజాతో నటిస్తున్నాను అని మీడియాకు లీక్ ఇవ్వడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇక ఇప్పుడు ఇది చాలదు అన్నట్లుగా ఈ సినిమాకు బెంగాల్ టైగర్ అనే పేరును నిశ్చయించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఇదే టైటిల్ ను పవన్ తన గబ్బర్ సింగ్ సీక్వెల్ కు టైటిల్ గా పెడతాడు అని గతంలో చాల గట్టిగా రూమర్లు వచ్చాయి. దీనికి కారణం బెంగాల్ టైగర్ అనే టైటిల్ పవన్ కు చాల ఇష్టమైంది అని అంటారు. గతంలో వచ్చిన పవన్ ‘ఖుషీ’ సినిమాలో పవన్ పేరు సిద్దూ సిద్దార్ధ రాయ్ అయినా ఆ సినిమాలో ఎవరు తన పేరు అడిగినా బెంగాల్ టైగర్ సిద్దూ సిద్ధార్థ రాయ్ అని చెప్పడం తెలిసిన విషయమే. దీనితో ఈ పదానికి పవన్ అభిమానులు బాగా కనెక్ట్ అయిపోయారు. మరి అటువంటి పవర్ ఫుల్ టైటిల్ ను వాడే సాహసం రవితేజా చేస్తాడా ? అన్నదే ఇప్పుడు అందరికీ ఆసక్తికరంగా మారింది.